ఐపీఎల్ చరిత్ర అదే చెబుతోంది.. క్వాలిఫైయర్ 1 గెలిస్తే ట్రోఫీ ఖాయం!

  • ఐపీఎల్‌లో బలంగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్
  • క్వాలిఫైయర్ 1 గెలిచిన జట్టే ఛాంపియన్‌గా నిలుస్తున్న వైనం
  • గత 15 సీజన్లలో 12 సార్లు పునరావృతమైన చరిత్ర
  • గత ఎనిమిదేళ్లుగా ఇదే ఆనవాయతీ కొనసాగడం విశేషం
  • ఈసారి ఆర్సీబీ, గుజరాత్ మధ్య పోరుపై సర్వత్రా ఆసక్తి
ఐపీఎల్ ప్లేఆఫ్స్ దశకు చేరుకోవడంతో అసలైన ఉత్కంఠ మొదలైంది. అయితే, గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్ బలంగా కొనసాగుతోంది. అదేంటంటే.. క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టే దాదాపుగా టైటిల్ విజేతగా నిలవడం. ఈ గణాంకాలు ఇప్పుడు జరగబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌పై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?
2008లో ప్రారంభమైన ఐపీఎల్ చరిత్రలో ఈ సెంటిమెంట్‌కు బలమైన ఆధారం ఉంది. ముఖ్యంగా 2011 నుంచి ప్లేఆఫ్స్ విధానం అమల్లోకి వచ్చాక, ఇప్పటివరకు జరిగిన 15 సీజన్లలో ఏకంగా 12 సార్లు క్వాలిఫైయర్ 1లో విజయం సాధించిన జట్లే ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. అంటే.. దాదాపు 80శాతం సందర్భాల్లో ఇదే ఫలితం పునరావృతమైంది. ఇది ఈ మ్యాచ్ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తోంది.

ఇక ఇటీవలి చరిత్రను చూస్తే, ఈ నమ్మకం మరింత బలపడుతోంది. 2018 నుంచి 2025 వరకు గత ఎనిమిది సీజన్లలోనూ క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టే ఛాంపియన్‌గా నిలవడం ఒక ఆనవాయితీగా మారింది. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ మొదలుకొని, 2019, 2020లో ముంబై ఇండియన్స్, 2021లో సీఎస్‌కే, 2022లో గుజరాత్ టైటాన్స్, 2023లో మళ్లీ సీఎస్‌కే, 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్, గత ఏడాది (2025) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఇలా ప్రతీసారి క్వాలిఫైయర్ 1 విజేతలే టైటిల్ గెలుచుకున్నారు.

ఈ ఏడాది ఏం జరగనుంది?
ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరగనున్న క్వాలిఫైయర్ 1 పోరు అత్యంత కీలకంగా మారింది. నేడు ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతున్నాయి. మరి గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఆనవాయతీ ఈసారీ రిపీట్ అవుతుందా? లేక ఎలిమినేటర్ నుంచి వచ్చే జట్టు ఏదైనా అద్భుతం చేసి చరిత్రను తిరగరాస్తుందా? అనేది వేచి చూడాలి.

IPL 2026
Royal Challengers Bangalore
Gujarat Titans
IPL Playoffs
Qualifier 1
IPL Title
IPL History
Cricket
Sunrisers Hyderabad
Rajasthan Royals

More Telugu News